Friday, March 14, 2025
Friday, March 14, 2025
HomeGeneralపెద్దపల్లి జిల్లాలో వలస కార్మికుల పరిస్థితి దారుణం – భద్రత, సంక్షేమంపై ప్రశ్నలు!

పెద్దపల్లి జిల్లాలో వలస కార్మికుల పరిస్థితి దారుణం – భద్రత, సంక్షేమంపై ప్రశ్నలు!

పెద్దపల్లి జిల్లాకు వలస వచ్చిన కార్మికుల్లో ఎక్కువగా ఇటుక బట్టిల్లో పని చేస్తుంటారు. వీరికి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇతరత్రా నిబంధనలు పాటించడంలో యాజమాన్యాలు విఫలం అయ్యాయని పలుమార్లు ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడయితే వందలమంది కార్మికులు కాలినడకన కరీంనగర్ కలెక్టరేట్ కు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వలస కార్మికులపై జరుగుతున్న నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్పటి కలెక్టర్లు కూడా వలస కార్మికుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కార్మికులకు వసతులు కల్పించడం, వారి పిల్లలకు వారి మాతృ భాషలో చదువులు చెప్పించడం వంటి అంశాలు అమలు చేసేందుకు చొరవ తీసుకున్నారు.

గత సంవత్సరం మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సొంత ఊరికి తరలించగా పెద్దపల్లి పోలీసులు అక్కడికి వెల్లాల్సి వచ్చింది. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్ గాంధీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. తాజాగా సుల్తానాబాద్ లోని ఓ రైస్ మిల్లులో ఆరేళ్ల చిన్నారిని బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ చిదిమేసిన ఘటన సంచలనంగా మారింది. పోలీసులు కూడా నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ వలస కార్మికుల అంశం మాత్రం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి ఘటనలు పెద్దపల్లి జిల్లాలోని వలస కార్మికుల కుటుంబాల్లో చోటు చేసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వలస కార్మికుల కుటుంబాల సంక్షేమం గురించి పట్టించుకోవడం ఆ తరువాత వదిలేయడం షరా మాములే అన్నట్టుగా తయారైంది.

అసలేం చేయాలి..?

వాస్తవంగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఉపాధి పొందుతున్న కార్మికుల విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవల్సిన అవసరం ఉంది. కార్మిక విభాగానికి సంబంధించిన కార్యాలయాల్లో వీరి వివరాలు పూర్తిగా నమోదు కావాలని నిబంధనలు చెప్తున్నాయి. అంతేకాకుండా వీరి పూర్తి వివరాలతో కూడా జాబితాను కూడా కలెక్టరేట్ కార్యాలయం నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే వీరి కోసం ప్రత్యేకంగా లైజన్ ఆఫీసర్ లను నియమించి వారికి సహాయం అందించాల్సి ఉంటుంది. స్థానికంగా వలస కార్మికులకు పరిచయాలు లేకపోవడం, యాజమానులతో మాత్రమే వారికి పరిచయాలు ఉంటాయి. కానీ సామాజిక సేవ అందించే వారు కానీ అధికార యంత్రాంగం కానీ వారికి అంతగా పరిచయం ఉండదు. కాబట్టి వీరందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవల్సి ఉంటుంది. దీనివల్ల వలస కూలీలు నేరాలకు పాల్పడినా వారిని వెంటనే పట్టుకునేందుకు అవకాశం ఉండగా, వారికి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ పెద్దపల్లి జిల్లాలో చాలా వరకు కూడా వలస కార్మికుల వివరాలను సంబంధిత శాఖల అధికారులు సేకరించలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. కార్మికుల వివరాలను సేకరించి రిజిస్ట్రేషన్ చేయిస్తే అన్ని విధాలుగా మంచిదే అయినప్పటికీ ఈ అంశాన్ని మాత్రం విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments